ఫోటో షాపు మహిమతో మోదీని ఇప్పుడు... మన్మోహన్ ను ఎప్పుడో 'మాయ' చేశారు!
అడోబ్ ఫొటోషాప్ ను ఉపయోగించి ఎన్నో చిత్ర విచిత్ర మాయలు చేయవచ్చన్న సంగతి అందరికీ తెలిసిందే. గతవారంలో ప్రధాని నరేంద్ర మోదీ చెన్నై పర్యటనలో భాగంగా ఏరియల్ సర్వే నిర్వహించగా, మోదీ చాపర్ లో కూర్చుని బయటి దృశ్యాలను పరిశీలిస్తున్న ఓ చిత్రాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) విడుదల చేసింది. ఈ ఫోటోలో బయటి దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాస్తవానికి తీసిన ఫొటో ఒకటి అయితే, దానిలో అద్దం ఉన్న ప్రాంతంలో మరో వరద చిత్రాన్ని జోడించి, మార్ఫింగ్ చేసి బాగా కనిపిస్తుందన్న ఉద్దేశంతో పీఐబీ 'మాయ' చేసింది.
ఈ విషయంలో విమర్శలు వెల్లువెత్తగా చింతిస్తున్నట్టు కూడా తెలిపింది. ఈ తతంగమంతా అందరికీ తెలిసిందే. అయితే, ఇలా పీఐబీ ఇలా చేయడం ఇదే మొదటి సారి కాదు. గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలోనూ ఇలాగే చేసింది. ఆ ఫొటోలు ఇప్పటికీ 'ఫొటోడివిజన్. గవ్.ఇన్' వెబ్ సైట్లో ఉన్నాయి. వాస్తవ పరిస్థితులను ఒకే చిత్రంలో చూపించే ప్రయత్నంలో భాగంగానే ఇలా చేశామని, ఇటువంటి చిత్రాలు చాలానే ఉన్నాయని పీఐబీ అధికారి ఒకరు తెలిపారు.