ఈ దఫా హరికృష్ణకు మొండిచెయ్యే!
వచ్చే సంవత్సరం మార్చిలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో దివంగత ఎన్టీఆర్ కుమారుడు, ప్రస్తుత హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సోదరుడు నందమూరి హరికృష్ణకు మరో అవకాశం దక్కేలా లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2008లో రాజ్యసభకు ఎంపికైన ఆయన, 2014లో పార్లమెంట్ ఎన్నికలకు ముందు, సమైక్యాంధ్రకు మద్దతుగా తన రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ దఫా తనకు మరో అవకాశం ఇవ్వాలంటూ హరికృష్ణ, చంద్రబాబును కోరగా, సానుకూల స్పందన రాలేదని సమాచారం.
ఇక ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. కాంగ్రెస్ కు చెందిన జైరాం రమేష్, జేడీ శీలంల పదవీ కాలం పూర్తి కానుండగా, వీరికి మరో విడత అవకాశం లేదు. ఇక సుజనా చౌదరి, నిర్మలా సీతారామన్ (ఈమె రాజ్యసభ ఉప ఎన్నికలో గెలవడం జరిగింది) ల పదవీకాలం కూడా ముగియనుండగా, వీరిద్దరూ కేంద్ర మంత్రులుగా ఉండటంతో, వీరికి మరోమారు అవకాశం దక్కవచ్చు. మిగిలిన రెండింటిలో, వైకాపాకు ఒక స్థానం ఖాయం కాగా, మరో స్థానం టీడీపీ, బీజేపీ కలసి దక్కించుకునే అవకాశం ఉన్నాయి. ఆ మూడవ స్థానం కోసం పోటీ తీవ్రంగా ఉండటం, ఆ సీటుకు ఎవరిని ఎంపిక చేయాలన్నది యువనేత లోకేశ్ స్వయంగా పరిశీలిస్తుండటంతో హరికృష్ణకు మొండిచెయ్యి తప్పదనిపిస్తోంది. ఈ విషయంలో అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.