ఢిల్లీ కాలుష్య నివారణకు కేజ్రీవాల్ మార్కు ప్రణాళిక!
'దేశ రాజధానిలో నివసించడం అంటే ఒక గ్యాస్ ఛాంబర్ లో నివసించినట్టే' అంటూ ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో, ఢిల్లీలో కాలుష్య నివారణకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సరికొత్త సంస్కరణలకు తెరతీశారు. దేశ రాజధానిలో వాహనాల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతుండడంతో నగర వాసులను ట్రాఫిక్ ఇబ్బందులు పట్టిపీడిస్తున్నాయి. అదే సమయంలో అత్యంత కాలుష్య కారక నగరాల జాబితాలో ఢిల్లీ చేరుతోంది. ఈ కాలుష్యం కారణంగా ప్రతి ఏటా శీతాకాలంలో వివిధ సమస్యలతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలకు పరిష్కారంగా వారంలో ఒక రోజు వెహికల్ ఫ్రీ డేగా జరుపుకోవాలని కేజ్రీవాల్ ఇదివరకే సూచించిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమ స్ఫూర్తితో వారంలో ఒకరోజు సైకిల్ పై కార్యాలయాలకు వెళ్లాలని ఆయన సూచించారు.
అయితే, ఈ చర్యలు ఢిల్లీ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఏమాత్రం సరిపోవని భావించిన ముఖ్యమంత్రి, కాలుష్యానికి ముకుతాడు వేసేందుకు సరికొత్త ప్రణాళికను రచించారు. ఢిల్లీలో రిజస్ట్రేషన్ అయిన వాహన నెంబర్లలో చివరి సంఖ్యను సరి సంఖ్యలు, బేసి సంఖ్యలుగా విభజించారు. చివరి సంఖ్యల్లో సరి సంఖ్య కలిగిన వాహనాలు ఒకరోజు, అలాగే వాహన నెంబర్లలో బేసి సంఖ్యలు కలిగిన వాహనాలు మరోరోజు ఢిల్లీ రోడ్లపై తిరిగేందుకు అనుమతి ఇవ్వనున్నారు.
దీంతో ఢిల్లీ రిజస్ట్రేషన్ కలిగిన వాహనాలు రోజు విడిచి రోజు మాత్రమే నగర రోడ్లపై సంచరించేందుకు వీలవుతుంది. అయితే, ప్రభుత్వ వాహనాలను మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయించారు. ఆ లెక్కన సగం కాలుష్యం తగ్గుతుందని కేజ్రీవాల్ భావిస్తున్నారు. ఈ నిబంధన జనవరి 1 నుంచి అమలులోకి రానుంది. ఈ నిబంధనను కఠినంగా అమలు చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం, ట్రాఫిక్ విభాగం, ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్, రవాణా శాఖ ఇతర విభాగాలను భాగస్వాములను చేయనున్నారు.