Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సౌదీ అరేబియా ఎన్నికల్లో తొలిసారి పోటీ చేయబోతున్న మహిళలు

సౌదీ అరేబియా ఎన్నికల బరిలో మొదటిసారిగా మహిళలు నిలబడుతున్నారు. డిసెంబర్ 12న జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో వారికి అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో సుమారు 900 మంది మహిళలు పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. సౌదీలో మొదటిసారి 2005లో, తరువాత 2011లో మునిసిపల్ ఎన్నికలు జరిగాయి. కానీ ఈ రెండుసార్లు కేవలం పురుషులే పోటీ చేశారు. తాజాగా అక్కడి మహిళలకు కూడా పోటీ చేసేందుకు అవకాశం రావడంతో పలువురు మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో మహిళలుంటే చాలని, తాము వాళ్లకే ఓటేస్తామని, వారి గురించి తమకు ఏమీ తెలియకపోయినా పర్వాలేదని తాజాగా ఓటు హక్కు లభించిన ఓ ఉపాధ్యాయిని చెప్పారు. మరో విషయమేమిటంటే, సౌదీ జనాభా సుమారు 2.1 కోట్లు ఉంటే అందులో కేవలం 1.31 లక్షల మంది మహిళలకే ఇప్పటివరకు ఓటు హక్కు ఉంది. పురుష ఓటర్లు 13.5 లక్షల మంది ఉన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లి ఓటు నమోదు చేయించుకోవాల్సి రావడం, అధికారులు ఇబ్బంది పెట్టడం, అవగాహన లేమి వంటి కారణాల వల్లే ఓటర్లుగా నమోదు తగ్గిందని మహిళలు అంటున్నారు. అయితే మహిళలకు సమాన హక్కులు కలగా మిగిలిన సౌదీలో క్రమంగా సంస్కరణలు ప్రారంభమవడం విశేషం.

More Telugu News