ఇంట ఓడి... రచ్చ గెలిచేందుకు వెళ్లనున్న మోదీ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇంట ఓడి... రచ్చ గెలిచేందుకు వెళ్లనున్న మోదీ!

"ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు"... భారత ప్రధాని మోదీ, స్వదేశంలో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయి, బ్రిటన్ పారిశ్రామికవేత్తలను గెలిచి, ఇండియాకు పెట్టుబడులు తీసుకు వెళ్లేందుకు వస్తున్నారని బ్రిటన్ మీడియా విమర్శనాస్త్రాలు సంధించింది. బుధవారం నాడు నరేంద్ర మోదీ, మూడు రోజుల పర్యటన నిమిత్తం తొలిసారిగా బ్రిటన్ కు బయలుదేరి వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఆయన పర్యటనలో భాగంగా బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ తో లంచ్ కార్యక్రమంలోనూ, వాంబ్లే స్టేడియంలో తన గౌరవార్థం జరిగే ఓ పెద్ద రిసెప్షన్ లోను పాల్గొననున్నారు. బ్రిటన్ ప్రధాని డేవిడ్ కేమెరాన్, మోదీ పర్యటన కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నానని వెల్లడించిన వేళ, మీడియా మాత్రం ఆయనపై వ్యంగ్య బాణాలు సంధించింది. బీహార్ ఓటమితో ఆయన తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడిందని అభిప్రాయపడింది. ఇండియాలో బీజేపీ కష్టాలు, బ్రిటన్ పర్యటనలో ఆయన్ను నీడలా వెంటాడనున్నాయని కథనాలు ప్రచురించింది. సుమారు 15 బిలియన్ డాలర్లు (సుమారు రూ. లక్ష కోట్లు) విలువైన వాణిజ్యం, పెట్టుబడుల లక్ష్యంగా మోదీ వస్తున్నారని, ప్రస్తుతానికి బ్రిటన్ ఇన్వెస్టర్లు మోదీకి దూరంగానే ఉండవచ్చని 'ది ఇండిపెండెంట్' అభిప్రాయపడింది. ప్రపంచాన్ని 'రాక్' చేసిన ఓ వ్యక్తి స్వదేశంలో చతికిలబడ్డారని 'డైలీ టెలిగ్రాఫ్' వెల్లడించింది. కాగా, మోదీ పర్యటనను అడ్డుకోవాలని అవాజ్ నెట్ వర్క్ తదితర సంస్థలు ప్రయత్నిస్తాయన్న నిఘా వర్గాల హెచ్చరికలతో బ్రిటన్ సర్కారు అప్రమత్తమైంది.

More Telugu News