Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అరెస్టు చేసినా ఆ కళాకారుడు మళ్లీ పాడాడు!

‘పాటలు రాయడం, పాడటం ఆపే ప్రసక్తి లేదు’ అని ప్రముఖ తమిళ జానపద కళాకారుడు కోవన్ స్పష్టం చేశాడు. తమిళనాడు సీఎం జయలలితపై అభ్యంతరకర పాటలు రాసినందుకుగాను రాజద్రోహం కేసులో కోవన్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కస్టడీ పొడిగింపు కోసం బుధవారం కోర్టుకు తీసుకొచ్చిన సందర్భంగా కోవన్ తొలిసారి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాను జయలలిత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ రాసిన పాటలోని కొన్ని చరణాలు పాడి వినిపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, 'నేను వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతూ పాటలు రాస్తున్నాను.. పాడుతున్నానే తప్ప ఏ ఒక్క వ్యక్తిని ఉద్దేశించి మాత్రం రాయడం లేదు' అన్నారు. తన పాటలు తమిళనాడులో మద్యం నిషేధానికి ఎంతగా దోహదపడుతున్నాయో మొత్తం తమిళ సమాజానికి తెలుసని అన్నారు. అందుకే పోలీసులకు భయపడి తాను పాటలు రాయడం ఆపేది లేదని తమిళనాట మద్య నిషేధ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న 'మక్కల్ కలై ఇలక్కియ కళగం' సంస్థకు చెందిన కోవన్ స్పష్టం చేశారు.

More Telugu News