పెద్దగా చదువులేదు... మాట్లాడలేడు, వినలేడు.. అయినా ఎయిర్ క్రాఫ్ట్ తయారుచేశాడు
కేరళకు చెందిన అతని పేరు సాజి ధామస్, వయస్సు 45. ఇదుక్కి జిల్లాలోని తొడుప్పుజాలో కుటుంబంతో నివసిస్తున్నాడు. అతను చదువుకున్నది మాత్రం 7వ తరగతి. అయితేనేం, చిన్న ఎయిర్ క్రాఫ్ట్ ను తయారు చేశాడు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, అతను మాట్లాడలేడు, వినలేడు. సాజి మొదట్లో ఎలక్ట్రిక్ పనులలో మునిగి తేలాడు. వాటి రిపేర్లు చేసేవాడు.
ఈ సందర్భంగా అతని భార్య మారియా మాట్లాడుతూ, ‘మాకు వివాహమై 14 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి ఆయన చాలా బిజీగా ఉండేవారు. చిన్న చిన్న మోటార్లు, మిషన్లకు సంబంధించిన పనులతో తీరికలేకుండా గడిపేవారు. ఇదంతా నాకు అర్థమయ్యేదికాదు. ఆయనను వాటి జోలికి వెళ్లకుండా నేను చేసిన ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి. ఇక లాభం లేదని భావించి, ఆయన చేసే ప్రతి పనికి నేను సహాయపడేదానిని. మొదట్లో ఆయన హెలికాఫ్టర్ తయారు చేయాలనుకున్నారు. హెలికాఫ్టర్ ఇంజన్ కొనుగోలుకు డబ్బు అవసరం కనుక, ఏకంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతోనే ఆయన టచ్ లో ఉండేవాడు. అయితే, రాజీవ్ గాంధీ హత్యకు గురవడంతోనే సాజి కోరిక నెరవేరలేదు. దీంతో ఒక ఎయిర్ క్రాఫ్టును తయారు చేయాలని ఆయన అనుకున్నాడు. ఐదేళ్ల శ్రమ అనంతరం గత ఏడాది ఏప్రిల్ లో ఈ చిన్న ఎయిర్ క్రాఫ్ట్ ను తయారు చేశాడు. దీంట్లో ఇద్దరు కూర్చోవచ్చు. 20 అడుగుల ఎత్తులో ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఎగరగల్గుతుంది" అని చెప్పింది.
ఇందుకు సంబంధించిన కార్యక్రమాన్ని డిస్కవరీ ఛానెల్ లో ప్రసారం కూడా చేశారు. మధురైకు సమీపంలోని అంబసముద్రంలో ఉన్న ఒక ప్రయివేట్ ఎయిర్ లైన్స్ అకాడమీకి ఈ ఎయిర్ క్రాఫ్ట్ ను ఇచ్చివేశాడు. అయితే, ఈ ఎయిర్ క్రాఫ్ట్ ను తయారు చేసేందుకు అవసరమైన ఖర్చు అంతా సాజి సొంతగానే భరించాడు. అందుకుగాను తనకున్న భూమిని కొంత అమ్మివేశాడు. స్థానికుల సహాయంతో రెండు గదుల ఇల్లును నిర్మించుకుని ప్రస్తుతం ఈ భార్యాభర్తలు అందులో ఉంటున్నారు. తన భర్తకు స్థిరమైన ఒక ఉద్యోగాన్ని చూపించాలని, ప్రభుత్వం తమకు మద్దతుగా నిలవాలని’ మారియా, ఆమె కొడుకు జోషువా విజ్ఞప్తి చేశారు.