పక్షి బర్గర్ ఎత్తుకెళ్లి పోయిందంటూ ఫిర్యాదు...తలపట్టుకున్న ఇంగ్లాండ్ పోలీసులు
ఎమర్జన్సీ నెంబర్లకు ఆకతాయిలు ఫోన్ చేసి తలాతోకాలేని ప్రశ్నలు వేస్తూ... విచిత్రమైన ఫిర్యాదులు చేస్తున్నారంటూ అప్పుడప్పుడు మనం పేపర్లలో చూస్తూనే వుంటాం. ఇలాంటి ఆకతాయి వేషాలు మన దేశంలోనే కాదు, ఇంగ్లాండులో కూడా ఎక్కువగానే వున్నాయట. దీంతో అక్కడి పోలీసులు దీని నుంచి బయటపడడం ఎలాగబ్బా? అంటూ ఇప్పుడు తలపట్టుకుంటున్నారు. ఇంగ్లండ్ లో ఎమర్జెన్సీ నెంబర్ 999. ఎవరికైనా ఆపద ఎదురైనప్పుడు ఈ నెంబర్ కు ఫోన్ చేసి సహాయం అడగవచ్చు. అయితే, ఈ మధ్య ఓ వ్యక్తి ఈ నెంబర్ కి ఫోన్ చేసి చికెన్ ఏ ఉష్ణోగ్రతతో వండుతారండీ? అని అడిగాడట. అంతేకాదు, ఇది ఎమర్జెన్సీ నెంబరే కదా? అని రూఢీ చేసుకుని, 'ఓ పక్షి నా బర్గర్ ఎత్తుకెళ్లిపోయింది, తెచ్చివ్వండి' అని ఓ ప్రబుద్ధుడు ఫోన్ చేశాడట. 'ట్యాక్సీ నెంబర్ కావాలి, చిప్స్ ప్యాకెట్ ధర ఎంత?' అంటూ రకరకాల విసుగెత్తించే ఫోన్లు ఎమర్జెన్సీ నెంబర్ కి వస్తున్నాయట. దీంతో ఇలాంటి ఆకతాయిల ఆట ఎలా కట్టించాలంటూ బ్రిటన్ పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఎమర్జెన్సీ నెంబర్ పై అవగాహన కల్పించేందుకు బ్రిటన్ పోలీసులు కరపత్రాలు పంచుతున్నారు. అలాగే ఓ క్యాంపెయిన్ కూడా ప్రారంభించారు.