బతుకమ్మ పండుగ రోజే కేసీఆర్ ఇంటిలో సీబీఐ...అందుకే వేడుకలకు గవర్నర్ దూరం: ఎల్.రమణ
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై వరుస విమర్శలు గుప్పిస్తున్న టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు వేడుకగా జరుపుకునే బతుకమ్మ పండుగ రోజున కేసీఆర్ క్యాంపు ఆఫీసుకు సీబీఐ అధికారులు వెళ్లారని ఆయన పేర్కొన్నారు. సరిగ్గా పర్వదినాన కేసీఆర్ ను సీబీఐ ప్రశ్నించిందన్నారు. ఈ కారణంగానే ఈ వేడుకకు హాజరుకావాల్సిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ బతుకమ్మ వేడుకలకు హాజరుకాలేదని ఆయన తెలిపారు.
అవినీతి పుట్టలో నుంచి ఒక్కొక్క పాము బయటకు వస్తున్నట్లుగా కేసీఆర్ గతంలో చేసిన పాపాలన్నీ వరుసగా వెలుగులోకి వస్తున్నాయన్నారు. వీఆర్ఎస్ కు సంబంధించిన స్కీముల్లో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, వాటిపైనా సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఏకంగా సీబీఐ అధికారులే స్వయంగా సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి సీఎం హోదాలోని వ్యక్తినే ప్రశ్నిస్తే, దానిపై కేసీఆర్ గాని, కేసీఆర్ కుటుంబ సభ్యులు గాని నోరు విప్పకపోవడం దారుణమని రమణ విరుచుకుపడ్డారు.