బెంగళూరులో భయంకరమైన బైక్ రేస్...తిరిగిరాని లోకాలకు రేసర్లు!
భారతదేశంలో బైక్ రేసింగ్ పై ఆసక్తి అంతకంతకూ పెరుగుతోంది. అత్యాధునిక బైకులతో రేసింగులకు వెళ్లడం భారత్ లోని ప్రధాన పట్టణాల్లో నిత్యకృత్యంగా మారింది. తాజాగా బెంగళూరులో భయంకరమైన బైక్ రేసింగ్ జరిగింది. గత రాత్రి చోటుచేసుకున్న ఈ బైక్ రేసింగ్ లో రేసర్లంతా దుర్మరణం పాలవ్వడం విశేషం. గత అర్ధరాత్రి సరికొత్త అత్యాధునిక బైకులతో నలుగురు యువకులు బెంగళూరులోని ఎయిర్ పోర్టు రోడ్డెక్కారు. రేసింగ్ ప్రారంభమైన మరుక్షణం నలుగురు రేసర్లు రయ్ మంటూ దూసుకుపోయారు.
అయితే మరికాసేపట్లో గమ్యం చేరుకుంటారనగా, వీరిని అనుసరిస్తూ వీడియో తీస్తున్న కారును ఓ రేసర్ ఢీ కొట్టాడు. అంతే... ఒకడి తరువాత ఒకడు అలా నలుగురు రేసర్లు రోడ్డును బలంగా ఢీ కొట్టడంతో, రోడ్డుపై బైకులతోపాటు ఈడ్చుకుపోయారు. వీడియో తీస్తున్న వారు కారు దిగి చూసేటప్పటికే నలుగురు రేసర్లు అనంతలోకాలకు వెళ్లిపోయారు. వీరిలో ఎవరూ హెల్మెట్లు ధరించకపోవడం విశేషం. అలాగే రేసింగ్ లో ట్రైనింగ్ లేకపోవడం, అత్యంత రద్దీగా ఉండే రహదారిని ఎంచుకుని రేసింగ్ మొదలు పెట్టడం వంటి సాంకేతిక కారణాలు వీరి దుర్మరణానికి కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు.