కలాంపై వ్యాఖ్యలతో వివాదం రేపిన నేతకే ఆయన భవంతి కేటాయింపు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కలాంపై వ్యాఖ్యలతో వివాదం రేపిన నేతకే ఆయన భవంతి కేటాయింపు

భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను నాడు విమర్శించిన బీజేపీ నేత, కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయమంత్రి మహేష్ శర్మకే ఢిల్లీలోని ఆయన భవంతిలో నివసించే అవకాశం లభించింది. ఢిల్లీలోని 10 రాజాజీ మార్గ్ లో నాడు కలాం నివసించిన భవంతిని శర్మకు కేటాయించారు. ఈ విషయాన్ని సంబంధిత శాఖాధికారులు వెల్లడించారు. 11,776 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవంతి ఉంది. కాగా, శర్మకు దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వం ఈ భవనాన్ని కేటాయించిందంటున్న వారూ లేకపోలేదు. ఈ భవనాన్ని ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లుటెయెన్స్ తన కోసం నాడు కట్టించుకున్నాడు. ఈ సందర్భంగా మహేష్ శర్మ మాట్లాడుతూ, ‘కలాం జీ అంటే నాకెంతో గౌరవం. నాకు ఈ భవంతిని ప్రభుత్వం కేటాయించడం సంతోషంగా ఉంది. సాధారణ పద్ధతుల్లోనే ఈ భవంతిని నాకు కేటాయించారు’ అని అన్నారు. అయితే, ఈ భవంతిని మహేష్ శర్మకు కేటాయించడంపై ఇతర రాజకీయ పార్టీల నేతలు పలు విమర్శలు చేస్తున్నారు. కాగా, ఈ ఏడాది జులైలో కలాం మృతి చెందారు. కలాం గౌరవార్ధం ఢిల్లీలోని ఔరంగజేబు రోడ్డుకు ఆయన పేరుపెట్టారు. ఈ సందర్భంలోనే కలాంపై మహేష్ శర్మ గతంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. కలాం ముస్లిం అయినప్పటికీ, జాతీయ వాది, మానవతావాది అయినందున ఆ రోడ్డుకు ఆయన పెట్టారనీ, ఔరంగజేబు ఆదర్శనీయ వ్యక్తి కాదని నాడు ఆయన వ్యాఖ్యానించడంతో దేశ వ్యాప్తంగా పలు విమర్శలు తలెత్తాయి.

More Telugu News