ఇంద్రాణి ముఖర్జియాకి డెంగ్యూ?
కన్న కూతురు షీనా బోరాను హత్య చేసిన కేసులో రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్న ఇంద్రాణి ముఖర్జియా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు వార్తలొస్తున్నాయి. గత నెలలో ఆత్మహత్యాయత్నం చేశారంటూ ఆసుపత్రిలో చేరిన ఇంద్రాణి ఈసారి డెంగ్యూతో బాధపడుతున్నారు. ఆమెకు డెంగ్యూ జ్వరం సోకిందని పేర్కొంటూ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుకు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఆమె రక్తంలో ప్లేట్ లెట్స్ సంఖ్య సాధారణ స్థాయి నుంచి 65,000కు పడిపోయిందని వారు న్యాయస్థానానికి తెలిపారు. ఆమెకు వైద్యులు జైలులోనే చికిత్స అందిస్తున్నారని, పరిస్థితిలో మార్పు లేని పక్షంలో ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తామని జైలు అధికారులు వెల్లడించారు. కాగా, ఇంద్రాణి ఫోన్ కాల్స్ కు సంబంధించిన కొన్ని రికార్డులు తమకు లభ్యమయ్యాయని, ఆమె వాయిస్ ను సరిపోల్చుకోవడానికి ఆమె స్వర నమూనాలను పంపాలని కేసును విచారిస్తున్న సీబీఐ జైలు అధికారులను ఆదేశించింది.