బీహార్ ఎన్నికలు మోదీ పనితీరుకు నిదర్శనం కాదు: అమిత్ షా
ప్రస్తుతం బీహారులో జరుగుతున్న ఎన్నికలు మోదీ పనితీరుకు, కేంద్ర ప్రభుత్వానికి రెఫరెండం కాదు... ఈ మాటలన్నది ఎవరో కాదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. తొలి రెండు దశల ఎన్నికలు పూర్తయి, మూడవ దశ జరగనున్న వేళ అమిత్ నోటి నుంచి ఈ తరహా వ్యాఖ్యలు రావడం కొత్త చర్చకు దారితీసింది. బీహార్ లో బీజేపీ ప్రచారానికి 'సెంటర్ ఆఫ్ అట్రాక్షన్'గా నిలిచి ఇప్పటికే పలుమార్లు సుడిగాలి పర్యటనలు చేసి, బీజేపీని గెలిపిస్తే, చేపట్టే అభివృద్ధి పనుల గురించి ప్రచారం చేస్తుంటే, నేతలు, కార్యకర్తల్లో అయోమయం కలిగించే ఈ తరహా వ్యాఖ్యలు చేయడంపై బీజేపీ వర్గాలు అమిత్ పై అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
కాగా, తొలి రెండు దశల్లో తమదే పైచేయని, మూడు, నాలుగు, ఐదు దశల్లో క్లీన్ స్వీప్ చేస్తామని కూడా అమిత్ షా వ్యాఖ్యానించారు. ఒకవేళ బీహార్ లో ఓడిపోతే, సంస్కరణల అమలు ఆగిపోతుందని వస్తున్న విశ్లేషణలను ఆయన ఖండించారు. విధాన పరమైన నిర్ణయాలు, సంస్కరణలకు ఎటువంటి ఆటంకాలు ఉండవని అన్నారు. పార్లమెంటులో తమకు పూర్తి మెజారిటీ ఉందని, ఒక రాష్ట్రం ఎన్నికలు తమ ప్రభుత్వాన్ని ప్రభావితం చేయజాలవని తెలిపారు. అమిత్ వ్యాఖ్యలు పరోక్షంగా బీహార్ లో పార్టీ వెనుకంజను సూచిస్తున్నట్టు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు.