శరణార్థులకు ఆశ్రయంపై టర్కీ ప్రతిపక్ష నేత సంచలన వ్యాఖ్యలు
సిరియాకు చెందిన పాలబుగ్గల పసివాడు అయ్ లాన్ కుర్దీ మృతదేహం సముద్రపు ఒడ్డుకు కొట్టుకొచ్చిన తరువాత యూరోపియన్ యూనియన్ దేశాలు శరణార్థులకు ఆశ్రయం కల్పించేందుకు ముందుకు వచ్చాయి. అయితే, శరణార్థుల ముసుగులో ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు చొరబడే అవకాశం ఉందని గ్రహించిన యూరోపియన్ యూనియన్ దేశాలు పొరుగునే ఉన్న మరో ముస్లిం దేశం టర్కీకి సరికొత్త ప్రతిపాదన చేశాయి. 'ఏటా 3.3 బిలియన్ డాలర్ల సహాయం అందజేస్తాం, శరణార్థులకు ఆశ్రయం ఇవ్వండి' అంటూ కోరాయి. కానీ, ఈ ప్రతిపాదనను ఆ దేశాధ్యక్షుడు సున్నితంగా తిరస్కరించారు. అయితే, తిరస్కరించిన విషయాన్ని అధ్యక్షుడు గట్టిగా తేల్చిచెప్పలేదంటూ ఆ దేశ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.
ఇంతలో టర్కీ ఎన్నికలు ముంచుకొచ్చాయి. నవంబర్ 1న నిర్వహించనున్న ఎన్నికలు ఇప్పుడు శరణార్థుల చుట్టూ తిరుగుతున్నాయి. 'మానవత్వం చూపుదాం' అని అధికార పక్షం ప్రకటించే లోపే, ప్రధాన ప్రతిపక్షం దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు బిలియన్ డాలర్లు కాదు, పదమూడు బిలియన్ డాలర్లు ఇచ్చినా శరణార్థులకు ఆశ్రయం ఇచ్చేది లేదని ప్రధాన ప్రతిపక్షనేత కెమాల్ ఖరాబులట్ స్పష్టం చేశారు. టర్కీని మరో కాన్సట్రేషన్ క్యాంప్ గా మార్చబోమని యూరోపియన్ యూనియన్ కు ఆయన తేల్చిచెప్పారు. ఇక్కడ శిబిరాలు ఏర్పాటు చేసే కంటే సిరియాలో శాంతి స్థాపనకు కృషి చేయాలని ఆయన సూచిస్తున్నారు. కాగా, సిరియాలో పేలుతున్న ఆయుధాలన్నీ టర్కీ నుంచి సరఫరా అవుతున్నవే కావడం విశేషం!