మేము పాకిస్థానీలం... ముస్లింలం...అయినా భారత్ ను ద్వేషించం!: సోషల్ మీడియాలో పాక్ సోదరుల కామెంట్స్
'మేము పాకిస్థానీలము. అందునా ముస్లింలం. అయినా భారత్ ను ద్వేషించము' అని పాకిస్థానీలు చెబుతున్నారు. భారత్ లో రోజురోజుకీ పెరిగిపోతున్న మత ఛాందసవాదంపై ముంబైకి చెందిన ఆర్టిస్ట్ రామ్ సుబ్రమణ్యం 'మేము పాకిస్థాన్ ను ద్వేషించం' అంటూ సోషల్ మీడియా వేదికగా చేపట్టిన ఉద్యమం పాకిస్థాన్ కు పాకింది. సోషల్ మీడియాలో పాకిస్థానీలు కూడా భారతీయులకు దీటుగా స్పందిస్తున్నారు.
'నేను పాకిస్థానీని, ముస్లింని. అయినా భారత్ ను ద్వేషించను' అంటూ పోస్టులు పెడుతున్నారు. 'పాకిస్థానీగా ఉండేందుకు గర్విస్తాను, అల్లాను ప్రేమిస్తా, కానీ భారత్ ను ద్వేషించను' అంటూ మరో వ్యక్తి పేర్కొన్నారు. 'పాక్ పౌరులమైనందుకు గర్విస్తున్నాం... అల్లాను నమ్ముతాం...అలాగే భారత్ ను ప్రేమిస్తున్నాం. ఎందుకంటే, మేము కూడా ఒకప్పుడు భారతీయులమే' అంటూ సోషల్ మీడియాలో ఇబ్బడి ముబ్బడిగా సందేశాలు వచ్చిపడుతున్నాయి. దీంతో ఉగ్రవాదులకు తప్ప పాక్ ప్రజలకు భారతీయులపై ఎలాంటి ద్వేషం లేదని అర్థమవుతోంది.