‘అమరావతి’ అభిమానం అమెరికా ‘కారు’ ఎక్కింది!
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి అభిమానం ఎల్లలు దాటుతోంది. ఇప్పటికే అమరావతి రాజధాని శంకుస్థాపన రోజున కర్నూలులో జన్మించిన ఇద్దరు చిన్నారులకు వారి తల్లిదండ్రులు ‘అమరావతి’ పేరు పెట్టుకున్నారు. వీరిలో ఒకరు కర్నూలు జిల్లాకు చెందిన బాలిక కాగా, మరో బాలిక మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన చిన్నారి. వీరిద్దరికీ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ రూ.10 వేల చొప్పున బహుమతి అందించారు.
తాజాగా అమరావతిపై అభిమానం ఎల్లలు దాటింది. విదేశాల్లో ఉంటున్న ఏపీ వాసులు అమరావతిపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. అమెరికాలోని వర్జీనియాలో దంత వైద్య నిపుణుడిగా పనిచేస్తున్న పొన్నం సుధీర్ తన ఖరీదైన ఆడి కారు నెంబర్ ప్లేట్ మీద నెంబరుకు బదులు ‘అమరావతి’ అని రాయించుకున్నారు. టీడీపీ కార్యకలాపాల్లో ఉత్సాహంగా పాలుపంచుకునే సుధీర్ గతంలోనూ పలు సందర్భాల్లో మాతృభూమిపై తనకున్న మమకారాన్ని చాటుకున్నారు. విశాఖలో హుదూద్ విలయం సందర్భంగా ఆయన తనవంతుగా భారీ విరాళాన్నే ప్రకటించారు.