కదిలిన స్వర్ణరథం...తిరుమల మాడవీధుల్లో శ్రీవారి విహరింపు!
తిరుమలలో స్వర్ణరథం కదిలింది. దేవదేవుడు సర్వాంగ సుందరంగా అలంకృతుడై స్వర్ణరథంపై అధిరోహించిన శుభవేళ, వందలాది మంది భక్తులు తన్మయత్వంతో ఆడిపాడుతుండగా, మరెంతో మంది రథాన్ని లాగుతూ దేవదేవుని కృప తమపై ఉండాలని కోరుకుంటున్నారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు వచ్చిన వేళ, నేడు బంగారు రథంపై శ్రీవెంకటేశ్వరుడు తిరు మాడవీధుల్లో ఊరేగుతున్నాడు. ఉదయం 7 గంటల సమయంలో ఊరేగింపు ప్రారంభమైంది. రేపటితో బ్రహ్మోత్సవాలు ముగియనున్న సంగతి తెలిసిందే. పవిత్ర పుష్కరిణిలో చక్రస్నానంతో ఈ ఏటి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.