వివాదాస్పద కాశ్మీర్ ఎమ్మెల్యేపై ఢిల్లీలో ఇంకు దాడి
ఆవు మాంసంతో డిన్నర్ ఇచ్చిన జమ్ము కాశ్మీర్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఇంజినీర్ రషీద్ పై దాడులు కొనసాగుతున్నాయి. సాక్షాత్తు అసెంబ్లీలోనే ఆయనపై బీజేపీ ఎమ్మెల్యేలు దాడి చేసి, చెంప పగలగొట్టారు. తాజాగా నేడు ఢిల్లీలో ఆయనపై దాడి జరిగింది. ఢిల్లీ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహిస్తుండగా, ముగ్గురు వ్యక్తులు ఆయన ముఖంపై నల్లటి సిరా చల్లారు. తల్లితో సమానమైన గోమాతను తినడం ద్వారా తమ సెంటిమెంట్ ను దెబ్బతీయడం వల్లనే ఈ దాడి చేశామని చెప్పారు. జరిగిన ఘటనపై రషీద్ మాట్లాడుతూ, అందరూ పాకిస్థాన్ లోని తాలిబన్ల గురించి మాట్లాడుతున్నారని, ఇండియాలో జరుగుతున్నది కూడా చూడాలని అన్నారు. తనపై ఇంక్ పోసినంత మాత్రాన భయపడనని చెప్పారు. మరోవైపు, రషీద్ పై దాడి చేసిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.