బయటకు రాని 'పులి'... ఆగిన మార్నింగ్ షోలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బయటకు రాని 'పులి'... ఆగిన మార్నింగ్ షోలు!

తమిళనటుడు విజయ్ నటించిన తాజా చిత్రం 'పులి' విడుదల ఆలస్యమైంది. ఈ ఉదయం చిత్రం థియేటర్లలో విడుదల కావాల్సి వుండగా షోలన్నీ రద్దయ్యాయి. చిత్రం ఆలస్యం కావడానికి కారణం తెలియరాలేదు. కాగా, తమిళ సినిమా వర్గాల కథనం ప్రకారం, చిత్రానికి పెట్టుబడులు పెట్టిన ఫైనాన్షియర్లకు చెల్లింపులు జరగలేదని తెలుస్తోంది. మరోవైపు విదేశాల్లో స్థానిక డిస్ట్రిబ్యూటర్లకు నగదు చెల్లింపుల విషయంలో వచ్చిన గొడవలు అక్కడి షోలను రద్దు చేసుకునేలా చేశాయి. విదేశాల్లో చిత్రం ముందస్తు ప్రీమియర్ షోలు, ఇండియాలోని వందలాది థియేటర్లలో తెల్లవారుఝామున 4, 5 గంటలకు వేయాల్సిన ప్రీమియర్ షోలన్నీ రద్దుకాగా, తమిళనాట ఉదయం ఆటలు కూడా ఆగిపోయాయి. దీనిపై స్పందించిన హీరో విజయ్ పెండింగ్ మొత్తాన్ని తక్షణం అందజేసేందుకు సిద్ధమని ప్రకటించారు. చిత్రాన్ని డిజిటల్ రూపంలో థియేటర్లకు పంపే 'క్యూబ్' నుంచి కూడా ఇంకా క్లియరెన్స్ రాలేదని తెలుస్తోంది. క్యూబ్ సంస్థకు సైతం ఇంకా చెల్లింపులు జరగలేదని తెలుస్తోంది. కాగా, నిన్న పులి చిత్ర నిర్మాతలు, నటీనటులపై ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆఖరి నిమిషంలో నగదు లావాదేవీలు జరిపేందుకు అనుమతులు లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడినట్టు సమాచారం. మధ్యాహ్నానికి చెల్లింపులు పూర్తయి, ఆటలు కొనసాగుతాయని భావిస్తున్నామని, ఈ విషయంలో ఇంకా స్పష్టత రాలేదని ఓ థియేటర్ యాజమాన్యం వ్యాఖ్యానించింది.

More Telugu News