Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కంటి ముందే కన్నబిడ్డలు దూరమైన వేళ... ప్రపంచాన్ని కదిలించిన ఫోటో వెనకున్న దయనీయ గాథ

సముద్ర తీరంలో పడివున్న బాలుడి మృతదేహం చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా మానవతావాదులను కదిలించిన సంగతి తెలిసిందే. ప్రాణాలతో బయటపడ్డ ఆ బాలుడి తండ్రి అబ్దుల్లా కుర్దీ మీడియా ముందుకు వచ్చాడు. జరిగిన హృదయ విదారక ఘటనను విలపిస్తూ చెప్పాడు. సిరియాలో ఉండలేక టర్కీ చేరుకుని, అక్కడి నుంచి సముద్రం మీదుగా గ్రీస్ చేరుకుని ఆశ్రయం పొందాలనుకున్న అబ్దుల్లా, కొందరు స్మగ్లర్లను సంప్రదించాడట. వారు అబ్దుల్లాకు ఓ మోటారు బోటును ఇస్తామని హానీ ఇచ్చారు. తీరా ప్రయాణ సమయానికి 15 అడుగుల రబ్బరు పడవను మాత్రమే ఇచ్చారు. కెనడాకు వెళ్లి కొత్త జీవితం ప్రారంభించాలని కోటి ఆశలతో అబ్దుల్లా సహా మరో రెండు కుటుంబాలు ఆ చిన్న పడవ ఎక్కి ప్రయాణం ఆరంభించాయి. మార్గమధ్యంలో అలల తాకిడికి బోటు తిరగబడింది. అబ్దుల్లా ఇద్దరు కుమారులు అయిలాన్, గాలిబ్ లు నీటిలో పడిపోయారు. వారిని రక్షించాలన్న ఉద్దేశంతో ఇద్దరినీ పట్టుకుని ఈదలేక, భార్య రెహాన్ వైపునకు అయిలాన్ ను తోశాడు. "వాడి తల గాల్లో ఉంచేట్టు చూడు" అని కూడా చెప్పాడు. అది నది కాదు, కాసేపు ఈదితే ఒడ్డుకు చేరుకోవడానికి. మహా సముద్రం! ఈ ప్రమాదంలో అబ్దుల్లా తప్ప మరెవరూ బతకలేదు. "నాకిప్పుడింక ఏమీ వద్దు... నా దగ్గర ఏమీ లేదు కూడా"... తన ప్రియమైన వారి మృతదేహాలను తీసుకు వెళ్లేందుకు వచ్చిన అబ్దుల్లా చెబుతున్న మాటలివి. అత్యంత విలువైన కుటుంబాన్నే కోల్పోయిన తరువాత, 'నాకు మొత్తం ప్రపంచాన్ని ఇచ్చినా అక్కర్లేదు' అని విలపిస్తున్నాడు. ఇకపై స్మగ్లింగ్ పాయింట్ల వద్దకు వెళ్లి, తాను తెచ్చినట్టుగా శరణార్థులు తమ పిల్లలను పడవలు ఎక్కించవద్దని ప్రచారం చేస్తానని చెబుతున్నాడు.

More Telugu News