Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మేం అధికారంలోకి రావడానికి పవన్ కల్యాణ్ దోహదపడ్డారు!: మంత్రి ప్రత్తిపాటి వ్యాఖ్య

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఏపీ సర్కారు చేస్తున్న భూసేకరణపై జనసేన అధినేత, టాలీవుడ్ ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు విరుచుకుపడ్డారు. అయితే కొద్దిసేపటి క్రితం విజయవాడలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కీలక వ్యాఖ్యలు చేశారు. గడచిన ఎన్నికల్లో తమకు అధికారం అందడానికి పవన్ కల్యాణ్ దోహదపడ్డారని ఆయన పేర్కొన్నారు. తమ విజయానికి దోహదపడ్డ వారిలో ఒకడిగా ఉన్న పవన్ కల్యాణ్ తో తమకు ఎలాంటి విభేదాలు లేవని ఆయన తేల్చిచెప్పారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన భూమి కోసం చివరి ప్రయత్నంగానే భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తున్నామన్నారు. ఇప్పటికీ తాము భూ సమీకరణకే మొగ్గుచూపుతున్నామని ఆయన తెలిపారు. ఈ విషయంలో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయడానికి యత్నిస్తున్నామన్నారు. ఈ క్రమంలో రైతులనే కాక పవన్ కల్యాణ్ ను కూడా ఒప్పిస్తామన్నారు. ఇందులో భాగంగా సీఎం నారా చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ల మధ్య భేటీ ఏర్పాటు చేస్తామన్నారు. రేపు చంద్రబాబు హైదరాబాద్ లోనే ఉంటారని, రేపే వారి మధ్య సమావేశం జరిగే అవకాశాలు లేకపోలేదని కూడా ప్రత్తిపాటి చెప్పారు.

More Telugu News