Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'గాడ్స్‌ ఓన్‌ కంట్రీ'... కేరళకు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే..!

కేరళ... అందమైన ప్రకృతితో, నిత్యమూ వేలాది మంది పర్యాటకులను ఆకర్షించే కేరళకు 'గాడ్స్ ఓన్ కంట్రీ'గా పేరున్న సంగతి తెలిసిందే. కేరళకు అసలా పేరు ఎందుకొచ్చిందంటే... భారత ఉపఖండానికి నైరుతి దిశలో మలబార్‌ తీరాన ఈ రాష్ట్రం ఉంది. క్రీ.పూ 10 వ శతాబ్దంలోనే ఇక్కడ నాగరికత వెల్లివిరిసింది. పురాణాల ప్రకారం, శ్రీమహా విష్ణువు అవతారమైన పరశురాముడు సముద్రాన్ని వెనక్కి పంపి కేరళను వెలికితీశాడని గాధ. ఇతర దేశాల నుంచి వలస వచ్చిన సిరియన్‌ మలబార్‌ క్రైస్తవులు, ముప్పిల్ ముస్లిమ్‌ సమాజం, ట్రావెన్‌ కోర్‌ రాజుల పాలనలో కేరళ మహర్దశను సంతరించుకుంది. అనంత పద్మనాభస్వామికి దాసునిగా ప్రకటించుకున్న ట్రావెన్‌ కోర్‌ రాజ వంశీకులు, రాజ్యం ఆయనదేనని, ఆయన సేవకులుగా తాము పాలిస్తున్నామని చెప్పేవారు. అందువల్లే కేరళ దేవుడి సొంత దేశమైంది. 1498లో సుగంధ ద్రవ్యాల వర్తకం కోసం వాస్కోడగామా కేరళ తీరానికి వచ్చాడు. ఆపై డచ్చి, పోర్చుగీసు వారి యుద్ధాలలో డచ్చివారిదే పైచేయి కాగా, తదుపరి బ్రిటీష్ వారు కాలుమోపారు. స్వాతంత్ర్యానంతరం 1956 నవంబర్‌ 1న కేరళ రాష్ట్రం ఏర్పాటైంది. దేశంలోనే పూర్తి అక్షరాస్యత సాధించిన దేశమైన కేరళకు పర్యాటకం విషయంలోనూ ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులున్నాయి. దట్టమైన అడవులు, పర్వతాలు, జలపాతాలకు ఈ రాష్ట్రం నిలయం. ఏ విధమైన డెల్టాలూలేని కేరళలో మొత్తం 44 నదులు పారుతుంటాయి. వీటిల్లో 41 పడమరకు ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుండగా, మూడు మాత్రమే తూర్పునకు ప్రవహించి బంగాళాఖాతం చేరుతాయి. కేరళకు రక్షణగా పడమటి కనుమలు-తూర్పు అంచున నీలగిరి కొండలు, ఆపై పళని, అగస్త్యమలై, అన్నామలై పర్వతాలున్నాయి. కేరళ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన నదీ ముఖ ద్వారాలు (బ్యాక్ వాటర్స్) రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశాయి. దేశంలోని జల మార్గాల్లో 8 శాతం కేరళలోనే ఉన్నాయి. సముద్ర మట్టానికి దిగువన ఉన్న అతికొద్ది ప్రాంతాల్లో ఒకటైన కుట్టినాడ్ కేరళలోనే ఉంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు ఎప్పుడూ నీటిలోనే ఉంటాయి. 10 వేలకు పైగా వృక్షజాతులు, 900 రకాలకు పైగా ఔషధ మొక్కలకు కేరళ ప్రసిద్ధి. కథాకళి, కూడియాట్టం, కేరళ నటనం, మోహినీయాట్టం, తుల్లాల్‌, పాదయని, తెయ్యరు వంటి ప్రత్యేక కళారూపాలు అందరినీ ఆకర్షిస్తాయి. ప్రాచీన ఆయుధ యుద్ధ విద్య కళ కరిప్పయట్టును నేర్చుకునేందుకు విదేశీయులు సైతం వస్తుంటారు. ఆయుర్వేదం, పంచకర్మ చికిత్సలకు ప్రసిద్ధి చెందిన కేరళలో మరో ప్రత్యేక ఆకర్షణ బోట్‌ రేస్ లు. ప్రపంచంలోనే గ్రేటెస్ట్‌ టీమ్‌ స్పోర్ట్‌గా ఆరన్‌ముళ బోట్‌ రేస్‌ నిలిచింది. కేరళ రాష్ట్రమంతా, సంవత్సరం పొడవునా టూరిస్టులను ఆకర్షిస్తూనే ఉంటుంది. ఒక్క శబరిమల ఆలయానికి సంవత్సరంలో రెండు కోట్ల మందికి పైగా వస్తుంటారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నవంతుడైన దేవుడు త్రివేండ్రం (తిరువనంతపురం)లో అనంత పద్మనాభుని రూపంలో కొలువైవున్నాడు. ఈయనకు ఉన్న ఆభరణాలు, ఆస్తుల విలువను ఇంతవరకూ లెక్కే కట్టలేదు. వందలాది దేవాలయాలు, కన్నులకింపైన ఉత్సవాలు నిత్యమూ జరుగుతూ ఉండే కేరళ, వరల్డ్ టాప్-50 టూరిస్ట్ డెస్టినేషన్ లలో ఒకటి. అందుకే కేరళ 'గాడ్స్ ఓన్ కంట్రీ'. ఏమంటారు?

More Telugu News