Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేడు 14 వేల మంది బంగ్లా దేశీయులకు అపురూప కానుక ఇవ్వనున్న ఇండియా

భారత్, బంగ్లా సరిహద్దు ప్రాంతాల్లోని సుమారు 14 వేల మంది బంగ్లాదేశీయులకు నేడు భారత పౌరసత్వం లభించనుంది. వీరి గ్రామాలకు కొత్త భారత పిన్ కోడ్ సంఖ్యలు రానున్నాయి. వీరందరి ఊళ్లలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ నిర్వహణలో రేషన్ దుకాణాలు వెలుస్తాయి. అందరికీ మిగతా భారతీయుల మాదిరిగా అన్ని రకాల సేవలు దగ్గరవుతాయి. ఉద్యోగాలకు పోటీ పడేందుకు యువత అర్హత పొందుతుంది. దీంతో ఈ గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా భారత జెండాలు రెపరెపలాడుతున్నాయి. 41 సంవత్సరాల నాడు భారత్, బంగ్లాదేశ్ ల మధ్య కుదిరిన ఒప్పందానికి, ఇటీవలి ప్రధాని మోదీ బంగ్లా పర్యటన తరువాత ఆమోదముద్ర పడిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంలో భాగంగా రెండు దేశాల మధ్య ఉన్న 162 గ్రామాల సరిహద్దులు మారాయి. బంగ్లాదేశీయులు అధికంగా ఉన్న ప్రాంతాలు ఆ దేశంలోకి వెళ్లగా, భారతీయ మూలాలు కలిగివున్న ప్రాంతాలు ఇండియా పరిధిలోకి వచ్చాయి. ఈ ప్రాంతాల్లో సుమారు 50 వేల మంది వరకూ ప్రజలున్నారు. వీరిలో 14 వేల మంది ఉన్న ప్రాంతాలకు నేడు పిన్ కోడ్ సంఖ్యలను అందించనున్నట్టు కూచ్ బెహర్ కలెక్టర్ ఉళగనాథన్ వివరించారు. ఇప్పటివరకూ చిరునామాలు లేని వీరికి దాన్ని తొలి బహుమతిగా అందిస్తున్నట్టు తెలిపారు. ఈ 14 వేల మంది బంగ్లాదేశీయులూ నేటి నుంచి భారతీయులైపోతారని వివరించారు.

More Telugu News