రూ. 20,500కు బంగారం ధర!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రూ. 20,500కు బంగారం ధర!

ప్రముఖ రీసెర్చ్ అండ్ రేటింగ్స్ సంస్థ 'ఇండియా రేటింగ్స్' వేస్తున్న అంచనాలు నిజమైతే, సమీప భవిష్యత్తులో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 20,400 వరకూ తగ్గుతుంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ పరపతి సమీక్ష తరువాత వడ్డీ రేట్లను పెంచాలని నిర్ణయిస్తే, బులియన్ మార్కెట్ ఒక్కసారిగా పాతాళానికి పడిపోతుందని, ప్రస్తుతానికి గోల్డ్ పై తాము వ్యతిరేక దృక్పథాన్నే కొనసాగిస్తామని ఇండియా రేటింగ్స్ వెల్లడించింది. ఫెడ్ నిర్ణయాల తరవాత ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 900 నుంచి 1050 డాలర్ల మధ్య కదలాడవచ్చని, దీని ప్రకారం, ఇండియాలో గ్రాము బంగారం ధర రూ. 2,050 నుంచి 2,400 మధ్య ఉంటుందని తెలిపింది. ప్రపంచ వృద్ధి రేటుపై అనిశ్చితి తొలగి మామూలు పరిస్థితులు ఏర్పడే వరకూ 2009 నాటి స్థాయిల్లో ఉంటాయని అంచనా వేసింది. బంగారాన్ని అత్యధికంగా వినియోగిస్తున్న దేశాలుగా గుర్తింపున్న ఇండియా, చైనాల్లో ఇప్పుడు 2011-12 నాటి ధరల స్థాయి కొనసాగుతోంది. ఈ సంవత్సరం తొలి మూడు నెలల కాలంలో చైనాలో బంగారానికి డిమాండు 8 శాతం తగ్గగా, ఇండియాలో ఏకంగా 15 శాతం పెరిగింది. ప్రస్తుతానికి అంతంతమాత్రంగా ఉన్న బంగారు ఆభరణాల అమ్మకాలు, ధరలు దిగివస్తే ఊపందుకోవచ్చని నిపుణులు వ్యాఖ్యానించారు.

More Telugu News