దారులన్నీ ‘గోదారి’వైపే... ట్రాఫిక్ చక్రబంధంలో భాగ్యనగరి
ఓ వైపు పవిత్ర గోదావరి పుష్కరాలు... మరోవైపు వరుసగా రెండు రోజులు సెలవులు... వెరసి హైదరాబాదు నుంచి గోదావరి తీరానికి దారితీసే రహదారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. హైదరాబాదు నుంచి బాసర, వరంగల్, కరీంనగర్, ఖమ్మం తదితర తెలంగాణ జిల్లాలతో పాటు ఉభయగోదావరి జిల్లాలకు కూడా నగర ప్రజలు బయలుదేరారు.
ప్రస్తుతం ఖమ్మం జిల్లా భద్రాచలం వెళ్లే దారిపై కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వాహనాలన్నీ ఒకేసారి రోడ్డుపైకి వచ్చిన నేపథ్యంలో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ నెలకొంది. వేలాది వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇక వరంగల్ కు వెళ్లే దారిపై కూడా ట్రాఫిక్ ఒక్కసారిగా పెరిగిపోయింది. బాసర, కరీంనగర్ లకు దారితీసే దారులు కూడా వాహనాలతో నిండిపోయాయి. ఇక పుష్కర ఘాట్లు ఏర్పాటైన ప్రాంతాల వద్ద కూడా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.