క్రెడిట్ కార్డుల విషయంలో బ్యాంకుల దందాలకు పగ్గాలు వేసిన ఆర్ బీఐ... మారిన నిబంధనలతో ఊరట!
క్రెడిట్ కార్డులు తీసుకున్న కస్టమర్లపై ఎడాపెడా అదనపు చార్జీలను బాదుతున్న బ్యాంకులపై ఆర్ బీఐ దృష్టిని సారించింది. పాత నిబంధనలను మార్చింది. ఇకపై బ్యాంకులు చెల్లించాల్సిన మొత్తం, వాటిపై ఆలస్యపు చెల్లింపు రుసుములు వంటి వివరాలను కస్టమర్ కు తెలియజేసిన అనంతరమే విధించాలని ఆదేశించింది. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులో మూడు రోజులకు పైబడి జాప్యం జరిగినప్పుడు మాత్రమే జరిమానాలు విధించాలని, అంతకన్నా ముందు, విషయాన్ని క్రెడిట్ బ్యూరోలకు తెలియజేయాలని కూడా నిబంధనలను సవరించింది. కనీసం 90 రోజుల పాటు చెల్లింపులు జరగని ఖాతాలను మాత్రమే మొండి బకాయిలుగా పరిగణించాలని తెలిపింది. బిల్లుల చెల్లింపులో సూచించిన తేదీ కన్నా మూడు రోజుల తర్వాత చెల్లింపు అందిన ఖాతాలపై మాత్రమే లేట్ పేమెంట్ చార్జీలు విధించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కాగా, ఆర్ బీఐ గణాంకాల ప్రకారం ఇండియాలో 2.12 కోట్ల క్రెడిట్ కార్డులు వాడకంలో ఉన్నాయి. ఈ మారిన నిబంధనలతో కస్టమర్లకు కార్డుల వాడకం తదుపరి ఎదురయ్యే సమస్యల నుంచి కొంతమేరకు ఊరట లభిస్తుందని నిపుణులు వ్యాఖ్యానించారు.