కృష్ణకీర్తన్ పై రెండో రోజూ టీ ఏసీబీ ప్రశ్నల వర్షం... నోరు విప్పని టీడీపీ నేత తనయుడు
ఓటుకు నోటు కేసులో టీ టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణకీర్తన్ పై తెలంగాణ ఏసీబీ అధికారులు రెండో రోజు కూడా ప్రశ్నల వర్షం కురిపించారు. తొలి రోజున దాదాపు 8 గంటల పాటు కృష్ణకీర్తన్ ను విచారించిన ఏసీబీ అధికారులు రెండో రోజైన నిన్న రెండు గంటల పాటు విచారణ సాగించారు. తొలి రోజున నోరు విప్పని కృష్ణకీర్తన్ రెండో రోజు కూడా పెద్దగా నోరు తెరవలేదట. ఏసీబీ అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు ‘నాకేమీ తెలియదు’ అన్న సమాధానమే ఆయన చెప్పారని సమాచారం. దీంతో తలపట్టుకున్న ఏసీబీ అధికారులు విచారణను అర్థాంతరంగా ముగించారట.