ఎఫ్టీఐఐ విద్యార్థులకు సల్మాన్ ఖాన్ మద్దతు
ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్టీఐఐ)కు టీవీ నటుడు గజేంద్ర చౌహాన్ ను చైర్మన్ గా నియమించడం పట్ల సంస్థ విద్యార్థుల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకడం విదితమే. దీనిపై ఎఫ్టీఐఐ విద్యార్థులు కొన్ని రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. తాజాగా, వీరికి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మద్దతు పలికారు. విద్యార్థుల అభిప్రాయాన్ని మన్నించి గజేంద్ర చౌహాన్ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలని సల్మాన్ సూచించారు. ఇన్ స్టిట్యూట్ విద్యార్థులే సినిమా పరిశ్రమను సుసంపన్నం చేశారని, అందుకే వారి మాటకు విలువ ఇవ్వాలని హితవు పలికారు. ఎఫ్టీఐఐ విద్యార్థులకు బాలీవుడ్ నుంచి బాగానే మద్దతు లభిస్తోంది. చాలా మంది స్టార్లు గజేంద్ర చౌహాన్ కు వ్యతిరేకంగా గళం వినిపించారు.