పాక్ ను పీకేశారు, భారత్ ను బాదేశారు, సఫారీలను చుట్టేశారు... వాళ్లు పిల్లలా?
అమ్మో... ఇకపై బంగ్లాదేశ్ ను చూస్తే 'వామ్మో' అనుకోవాల్సిందే. నిన్నమొన్నటి వరకూ పసికూనల్లా కనిపిస్తూ వచ్చిన బంగ్లాదేశ్, ఇప్పుడు పెద్ద జట్లకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఆ జట్టు పాకిస్థాన్ ను ఓడిస్తే... 'కాలం కలిసొచ్చిందిలే' అనుకున్నాం. భారత్ కు షాకిస్తే... 'మన టైం బ్యాడ్' అని సరిపెట్టుకున్నాం. ఇప్పుడు దక్షిణాఫ్రికా సైతం బంగ్లా ఆటగాళ్ల పంజాకు నేలకరిచింది. మూడు వన్డేల సిరీస్ ను ఆ జట్టు 2-1 తేడాతో గెలుచుకుని తామిక పసి కూనలం కాదని సవాల్ విసిరింది. చివరి రెండు వన్డేల్లో ఆ జట్టు చూపిన ప్రతిభను చూసి క్రికెట్ పండితులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. దక్షిణాఫ్రికాపై బంగ్లాదేశ్ సాధించిన తొలి సిరీస్ విజయం ఇదే కావడం గమనార్హం. తదుపరి అదే జట్టుపై రెండు టెస్టులను ఆడనున్న బంగ్లా, ఆ మ్యాచ్ లలోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది.