'బాహుబలి'కి మేక బలి!... వాట్స్ యాప్ లో ఫొటో హల్ చల్
రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్టు 'బాహుబలి' శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా విడుదలైన థియేటర్ల వద్ద భారీ కోలాహలం నెలకొంది. ఓ రకంగా తెలుగు రాష్ట్రాలు 'బాహుబలి' ఫీవర్ తో ఊగిపోతున్నాయని భావించవచ్చు. మీడియా కూడా ఈ సినిమా విడుదలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టినట్టు అర్థమవుతోంది. ఇక, అభిమానుల సంగతి సరేసరి! ఈ సినిమా రికార్డులు బద్దలు కొట్టాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా వికారాబాదులో ఫ్యాన్స్ సినీ మ్యాక్స్ థియేటర్ వద్ద మేకను బలిచ్చినట్టు తెలిసింది. థియేటర్ వద్ద 'బాహుబలి' పోస్టర్ ముందు రక్తపు మడుగులో పడి ఉన్న మేకను ఫొటో తీసి వాట్స్ యాప్ లో పెట్టారు. ఇప్పుడీ ఫొటో హల్ చల్ చేస్తోంది. అయితే, సినిమా బంపర్ హిట్ అవ్వాలని మేకను బలివ్వడం పట్ల వ్యతిరేక స్పందన వ్యక్తమవుతోంది.