రామోజీ గ్రూపు నుంచి మరో 4 ఛానళ్లు... ఆగస్టు 27న ప్రారంభం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రామోజీ గ్రూపు నుంచి మరో 4 ఛానళ్లు... ఆగస్టు 27న ప్రారంభం

1995 ఆగస్ట్ 27వ తేదీన ఈటీవీ ప్రసారాలను ప్రారంభించిన రామోజీ గ్రూపు... తదనంతర కాలంలో ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో దూసుకుపోయింది. అనేక వినోద, వార్త ఛానల్స్ తో జాతీయ స్థాయిలోని గొప్ప నెట్ వర్క్ లలో ఒకటిగా ఎదిగింది. ప్రస్తుతం తెలుగు ఛానళ్లను మాత్రమే తన దగ్గర ఉంచుకుని, ఇతర భాషా ఛానళ్లను రిలయన్స్ గ్రూపుకు విక్రయించింది రామోజీ గ్రూప్. ఆ తర్వాత, ఇటీవలే ఒరియాలో న్యూస్ ఛానల్ ప్రారంభించిన రామోజీ గ్రూప్ వచ్చే నెలలో ఏకంగా నాలుగు తెలుగు ఛానళ్లను ప్రారంభించబోతోంది. ఈటీవీ 20వ వార్షికోత్సవాల సందర్భంగా ఈ నాలుగు ఛానళ్లను ప్రారంభించనున్నారు. ఈటీవీ లైఫ్, ఈటీవీ సినిమా, ఈటీవీ ప్లస్, ఈటీవీ అభిరుచి పేరుతో రానున్న ఈ ఛానళ్లు తెలుగు ప్రేక్షకులను అలరింపజేయనున్నాయి. యువతరాన్ని ఆకట్టుకునేలా ఈటీవీ ప్లస్ ఉండబోతోంది. ఇందులో కామెడీకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మరోవైపు, ఫ్యామిలీ ఓరియెంటెడ్ టీవీ ఛానల్ గా ఈటీవీ లైఫ్ రాబోతోంది. ఇందులో ఆరోగ్యం, యోగా, ఆయుర్వేదం లాంటి సుఖీభవ తరహా కార్యక్రమాలు ఉంటాయి. ఈటీవీ అభిరుచి విషయానికి వస్తే... ఇది పూర్తిగా వంటా వార్పుల ఛానల్. ఇక ఈటీవీ సినిమా ఛానల్ పూర్తి స్థాయి సినిమా ఛానల్. ఆగస్ట్ 27న ప్రారంభమయ్యే ఈ నాలుగు ఛానళ్లు తెలుగు ప్రేక్షకులను రంజింపజేస్తాయనడంలో సందేహం లేదు.

More Telugu News