భారత్ బాటలో నడవాలనుకుంటున్న ఈజిప్టు
ఉగ్రవాదం కారణంగా ప్రభావితమవుతున్న ఈజిప్టు ఇప్పుడు భారత్ బాటలో నడవాలనుకుంటోంది. టెర్రరిజంపై పోరులో భారత్ అనుభవాల సారాన్ని ఒడిసిపట్టేందుకు తాము ఆసక్తిగా ఉన్నామని ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ అల్-సిసి తెలిపారు. అక్టోబరులో న్యూఢిల్లీలో మూడవ ఇండియా-ఆఫ్రికా ఫోరమ్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి హాజరు కావాలని ఈజిప్టు అధ్యక్షుడిని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఆయనను ఆహ్వానించేందుకు తన ప్రత్యేక దూత ముఖ్తార్ అబ్బాస్ నక్వీని ఈజిప్టు పంపారు. ఈ సందర్భంగా నక్వీ అధ్యక్షుడు సిసితో భేటీ అయ్యారు.
కౌంటర్ టెర్రరిజం, ఉమ్మడి సమస్యలు, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం వంటి అంశాలపై చర్చించారు. ఈ భేటీపై ఈజిప్టు విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇరు దేశాల మధ్య సుదీర్ఘ కాలంగా నెలకొన్న సుహృద్భావ సంబంధాలను అధ్యక్షుడు సిసి ఈ సందర్భంగా ప్రస్తుతించారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మరిన్ని అంశాల్లో ద్వైపాక్షిక సంబంధాలను విస్తరించేందుకు ఈజిప్టు సిద్ధంగా ఉందని, భారత్ రాజకీయ, ఆర్థిక రంగాల్లో అందిపుచ్చుకున్న అనుభవం పట్ల ఆయన అభినందించారని వివరించారు. ఇక, టెర్రరిజంపై భారత్ పోరాట పంథా, అనుభవాల సారాన్ని ఈజిప్టు అందిపుచ్చుకునేందుకు ఆసక్తిగా ఉందని అధ్యక్షుడు పేర్కొనగా, భారత దూత స్వాగతించారని కూడా ఆ ప్రకటనలో తెలిపారు.