ధోనీకి ఘాటు సమాధానమిచ్చిన ఉమేష్ యాదవ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ధోనీకి ఘాటు సమాధానమిచ్చిన ఉమేష్ యాదవ్

టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి బౌలర్ ఉమేష్ యాదవ్ ఘాటైన సమాధానమిచ్చాడు. బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా 'అంతర్జాతీయ స్థాయి టోర్నీ ఆడుతున్న బౌలర్లు నిలకడగా బౌలింగ్ చేయలేకపోతే తాను చేయగలిగిందేమీ లేదు కదా?' అని ధోనీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. బంగ్లా పర్యటనలో ఉమేష్ అంచనాల మేరకు రాణించలేకపోయాడు. అదే సమయంలో బంగ్లా తరపున అరంగేట్రం చేసిన ముస్తాఫిజుర్ రెహ్మాన్ అద్భుతమైన బౌలింగ్ తో టీమిండియాను ఓడించాడు. దీంతో ధోనీ ఈ వ్యాఖ్యలు చేశాడు. దానిపై ఉమేష్ యాదవ్ ఇప్పుడు ఘాటుగా స్పందించాడు. కనీస ప్రమాణాలు కలిగిన ఫాస్ట్ బౌలర్లు చేసే తప్పులు చాలా తక్కువగా ఉంటాయని అన్నాడు. బౌలింగ్ కారణంగానే తాను జట్టులో కొనసాగుతున్నానని స్పష్టం చేశాడు. ఇప్పటికే అంతర్జాతీయ టోర్నీల్లో వికెట్లు తీసి సత్తా చాటుకున్నానని చెప్పాడు. ఫాస్ట్ బౌలర్ నిలకడగా బౌలింగ్ చేయడం కష్టంతో కూడుకున్నదని ఉమేష్ తెలిపాడు. మీడియం పేసర్ 130 నుంచి 135 కిలో మీటర్ల వేగంతో బంతులేయడం సులభమే, కానీ ఓ ఫాస్ట్ బౌలర్ వేగంగా బంతిని సంధిస్తూ, నియంత్రించడం అన్ని వేళలా సాధ్యం కాదని ఆయన పేర్కొన్నాడు. తాను ఫెయిలయినప్పుడు ప్రయోగాలు చేస్తుంటానని, అలాంటప్పుడు పరుగులు వెళ్తుంటాయని ఉమేష్ తెలిపాడు. ముస్తాఫిజుర్ లా తాను బౌలింగ్ చేయలేనని, అలాగే తనలా ముస్తాఫిజుర్ బౌలింగ్ చేయలేడని ఉమేష్ స్పష్టం చేశాడు.

More Telugu News