అకారణంగా దూషించి మమ్మల్ని రెచ్చగొట్టారు: భూమా అఖిలప్రియ
తన తండ్రి, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అరెస్టుపై ఆయన కుమార్తె, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ స్పందించారు. నంద్యాలలో 'ఎమ్మెల్సీ' పోలింగ్ సందర్భంగా పోలీసులే తమను రెచ్చగొట్టారని, అకారణంగా దూషించారని అన్నారు. తన తండ్రిపై తప్పుడు కేసు బనాయించారని ఆరోపించారు. ఓటింగ్ సందర్భంగా తాము పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లామని, తన తండ్రి పనిమీద బయటికి వచ్చారని, ఆ సమయంలో అక్కడే ఉన్న తనను పోలీసులు ఓటేసి వెంటనే వెళ్లిపోవాలని అన్నారని అఖిలప్రియ వివరించారు. ఆ సందర్భంగా పోలీసులు తనతో చాలా దురుసుగా మాట్లాడారని ఆమె తెలిపారు. ముఖ్యంగా, డీఎస్పీ విపరీత ప్రవర్తన కనబర్చాడని, ఈ విషయం తెలుసుకున్న తన తండ్రి తీవ్రంగా స్పందించారని అఖిల పేర్కొన్నారు. దాంతో, ఆయనపై కేసు బనాయించారని వివరించారు.