'టాప్' పథకంలో తన పేరు లేని విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన జ్వాల
భారత బ్యాడ్మింటన్ రంగంలో అగ్రశ్రేణి డబుల్స్ క్రీడాకారిణి గుత్తా జ్వాల శుక్రవారం నాడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కలిశారు. ఒలింపిక్ పతకం లక్ష్యంగా ప్రవేశపెట్టిన 'టాప్' పథకంలో తన పేరు లేకపోవడాన్ని ఆమె సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఆమె సమస్య పట్ల ఆయన సానుకూలంగా స్పందించారు. తెలంగాణ క్రీడాకారులకు అవసరమయ్యే సౌకర్యాల కల్పనకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అంతేగాకుండా, జ్వాల అంశాన్ని ప్రస్తావిస్తూ కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. జ్వాల-అశ్విని పొన్నప్ప జోడీని 'టాప్' పథకంలో చేర్చాలని ఆ లేఖలో కోరారు.