అరుణ్ జైట్లీకీ అంటిన 'మోదీ' మురికి... లండన్ స్టార్ హోటల్లో గంటల తరబడి మంతనాలు!
"అరుణ్ జైట్లీ... లండన్ లోని తాజ్ హోటల్లో మిస్టర్ లలిత్ మోదీని ఒంటరిగా కలిసి గంటల సమయం గడపలేదా?" ఈ ప్రశ్న వేసింది ఎవరనుకుంటున్నారు? ఐపీఎల్ ఫిక్సింగ్ కుంభకోణంలో పీకల్లోతు కూరుకుపోయిన లలిత్ మోదీయే. ఇప్పటికే కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజేలతో పాటు మాజీ కేంద్రమంత్రులు శరద్ పవార్, రాజీవ్ శుక్లాలను ఇరికించిన ఆయన తాజాగా ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీపై విరుచుకుపడ్డారు. బీసీసీఐ సభ్యులుగా ఉన్నవారు టీఏ/డీఏల రూపంలో కోట్లాది రూపాయలు తీసుకుని ప్రైవేటు విమానాల్లో విదేశాలకు వెళ్లి గడిపి వచ్చారని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. వీరంతా తాము తీసుకున్న టీఏ/డీఏలను ఆదాయపు ఖాతాల్లో తెలిపారా? అని ప్రశ్నించారు. ఫస్ట్ క్లాస్ ప్రయాణాలు, స్టార్ హోటళ్లలో బస చేసే వీరు బీసీసీఐకి రెట్టింపు మొత్తంలో బిల్లులు పెట్టి డబ్బు తీసుకున్న సందర్భాలూ ఉన్నాయని తెలిపారు.
నేతల ప్రైవేటు విమానాల వాడకంపై తాను ఐటీ అధికారులకు అన్ని సాక్ష్యాలూ ఇచ్చానని, వాటన్నింటినీ తగులబెట్టేశారని లలిత్ మోదీ ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో జైట్లీ తనను లండన్ లోని తాజ్ హోటల్లో కలుసుకున్నారని అన్నారు. రాజీవ్ శుక్లా ఏకంగా తనను బెదిరించారని ఆరోపించారు. తన ప్రైవేటు జెట్ ట్రిప్పులకు అయ్యే ఖర్చు ఇవ్వాలని డిమాండ్ చేసేవాడని వివరించారు. పదేళ్ల క్రితం నుంచి నేతలు వాడిన ప్రైవేటు విమానాల జాబితాను డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) ప్రజల ముందు పెట్టాలని మోదీ డిమాండ్ చేశారు.