తెలంగాణ ఆర్టీసీ కొత్త లోగో ఆవిష్కరణ
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కొత్త లోగోను రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు. నేటి నుంచి ఈ కొత్త లోగోతోనే బస్సులు తిరగనున్నాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉన్న ఈ లోగోను జ్ఞానేశ్వర్ అనే కళాకారుడు రూపొందించారు. గుండ్రటి ఫ్రేమ్ లో కాకతీయుల కళాతోరణం, దాని మధ్య చార్మినార్ రూపాన్ని తీర్చిదిద్దారు. వాటి కింద 'ప్రగతి రథం, ప్రజల నేస్తం' అనే నినాదాన్ని ఉంచారు. ఫ్రేమ్ చుట్టూ పసుపు, ఆకుపచ్చ రంగులతో రింగులు రూపొందించారు. ఈ సందర్భంగా లోగో గురించి జ్ఞానేశ్వర్ వివరిస్తూ, పసుపు రంగు సీఎం కేసీఆర్ కలలు కంటోన్న బంగారు తెలంగాణను ప్రతిబింబిస్తుందని చెప్పారు. 'గ్రీన్ తెలంగాణ' అంటోన్న సీఎం ఆశయానికి ప్రతీకగా ఆకుపచ్చ రంగు నిలుస్తుందని పేర్కొన్నారు.