ఏపీసీసీ వర్సెస్ టీపీసీసీ...ఏపీకి ‘హోదా’ తమకు నష్టమన్న గుత్తా, మండిపడ్డ రఘువీరా!
ఏపీకి ప్రత్యేక హోదా అంశం ఆంధ్రప్రదేశ్ పీసీసీ, తెలంగాణ పీసీసీల మధ్య అగ్గి రాజేసింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తమ రాష్ట్రానికి నష్టమని టీపీసీసీకి చెందిన నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి వాదనను ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తిప్పికొట్టారు. అంతేకాక గుత్తాపై పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి రఘువీరా ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే, ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని గుత్తా వాదిస్తున్నారు. అంతేకాక ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు నష్టం వాటిల్లుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణలోని పరిశ్రమలన్నీ ఏపీకి తరలిపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కారణంగా ఏపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యేక హోదా ఇవ్వవద్దని ప్రధాని నరేంద్ర మోదీకి గుత్తా ఏకంగా లేఖ రాశారు. ఈ విషయం తెలుసుకున్న ఏపీసీసీ చీఫ్ రఘువీరా గుత్తా చర్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఏమీటీ చెత్త రాతలు?' అంటూ నిలదీశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే గుత్తాకు వచ్చిన నష్టమేంటని మండిపడ్డారు. అంతటితో ఆగని రఘువీరా పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి గుత్తాపై ఫిర్యాదు చేశారు. మరి ఇరు రాష్ట్రాల పీసీసీల మధ్య ఏర్పడ్డ ఈ తగవును సోనియా ఎలా పరిష్కరిస్తారో చూడాలి.