రాహుల్ వేగాన్ని అందుకోలేక చతికిలపడ్డ టీ కాంగ్ నేతలు... సొమ్మసిల్లిన వీహెచ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాహుల్ వేగాన్ని అందుకోలేక చతికిలపడ్డ టీ కాంగ్ నేతలు... సొమ్మసిల్లిన వీహెచ్!

ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ నుంచి ఫడ్యాల్ వరకు పాదయాత్రను చేపట్టిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని అనుసరించలేక తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వయసు పైబడినవారితో కళకళలాడే కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ నూతనోత్సాహం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన దేశంలోని రైతులను పరామర్శించేందుకు పాదయాత్రలు చేస్తున్నారు. నిన్న ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నుంచి ఫడ్యాల్ వరకు చేసిన పాదయాత్రలో రాహుల్ ను అనుసరించలేక కాంగ్రెస్ నేతలు నానాతంటాలు పడ్డారు. రెండు కిలోమీటర్లు రాహుల్ తో పాటు నడిచిన షబ్బీర్ అలీ, ఆ తర్వాత నడవలేక మీడియా వాహనం ఎక్కేశారు. పొన్నాల లక్ష్మయ్య అయితే కారు దిగనేలేదు. తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కార్యాధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క మాత్రం ఒకరి తరువాత ఒకరు అన్నట్టు ఆయన వెంట సగం దూరం చొప్పున నడిచారు. సరిగ్గా 7 కిలోమీటర్లు రాహుల్ గాంధీని అనుసరించిన కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ లక్ష్మణచాంద తండా వరకు వచ్చేసరికి సొమ్మసిల్లి పడిపోయారు. 15 కిలోమీటర్ల పాదయాత్రలో పది నిమిషాల చొప్పున రెండు సార్లు రాహుల్ విరామం తీసుకుని పార్టీ నేతలకు అందకుండా ఉత్సాహంగా యాత్ర చేశారు. రాహుల్ రైతులను పరామర్శించినప్పుడు, ఎప్పట్లానే కుర్చీలు, మంచాల కోసం చూడకుండా నేలపైనే కూర్చుని వారితో మాట్లాడడం విశేషం.

More Telugu News