రాయుడు దెబ్బకు ‘రాయల్స్’ విలవిల... ఉత్కంఠ పోరులో ముంబై విజయం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాయుడు దెబ్బకు ‘రాయల్స్’ విలవిల... ఉత్కంఠ పోరులో ముంబై విజయం

ఐపీఎల్-8లో విజయాల పరంపరతో దూసుకెళుతున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు హైదరాబాదీ క్రికెటర్ అంబటి రాయుడు దెబ్బకు విలవిల్లాడింది. విజయం కోసం ముఖం వాచిపోయిన ముంబై ఇండియన్స్ రాయుడు సూపర్ ఇన్నింగ్స్ తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోగలిగింది. కేవలం 27 బంతుల్లోనే రాయుడు నాలుగు ఫోర్లు, మూడు సిక్స్ లతో చెలరేగి 53 పరుగులు చేశాడు. ముంబై గెలుపులో కీలక భూమిక పోషించిన రాయుడుకే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. టాస్ గెలిచిన రాజస్థాన్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ముంబై ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు లెండిల్ సిమ్మన్స్ (38), పార్ధీవ్ పటేల్ ఠ(23) శుభారంభాన్నిచ్చారు. ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ (27) కూడా రాణించాడు. తదనంతరం బ్యాటింగ్ కు వచ్చిన రాయుడు వీరవిహారం చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ముంబై ఇండియన్స్ 187 పరుగులు చేసింది. ఇక 188 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లను కోల్పోయి 179 పరుగులే చేయగలిగింది. ఓపెనర్లు అజింక్యా రెహానే (16), షేన్ వాట్సన్ (28) ఫరవాలేదనిపించారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సంజూ శామ్ సన్ ముంబై బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. 46 బంతుల్లో సంజూ 76 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో రాయల్స్ విజయం ఖాయమనుకున్నారు. అయితే సంజూ ఔటైన తర్వాత రాజస్థాన్ బ్యాట్స్ మెన్ తడబడ్డారు. దీంతో చివరి దాకా ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో ముంబై 8 పరుగులతో విజయం సాధించింది.

More Telugu News