ఐపీఎల్ లో మరో స్టార్ ఆవిర్భావం... టీమిండియాకు నిచ్చెన వేస్తాడా?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఐపీఎల్ లో మరో స్టార్ ఆవిర్భావం... టీమిండియాకు నిచ్చెన వేస్తాడా?

సర్ఫరాజ్ ఖాన్... నిన్నటి మ్యాచ్ లో అతడు రాజస్థాన్ రాయల్స్ పై 21 బంతుల్లో 45* పరుగులు చేసేంతవరకు అతడి పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. ఐపీఎల్-8లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడుతున్న ఈ యువకుడు ఇప్పటిదాకా ఓ రకంగా అనామకుడే. ఒక్క ఇన్నింగ్స్ తో అందరి దృష్టి ఆకర్షించాడు. వాట్సన్, ఫాక్నర్ వంటి దిగ్గజ బౌలర్లతో కూడిన రాయల్స్ బౌలింగ్ ను చితకబాదాడు. ఏబీ డివిలియర్స్ వంటి బ్యాటింగ్ దిగ్గజం ఉన్న జట్టులో అతడికంటే ఎక్కువ ఫేమ్ కొట్టేయడం మాటలుకాదు. డివిలియర్స్ రనౌట్ కావడంతో నిరుత్సాహం చెందిన ప్రేక్షకులు ఆ తర్వాత బరిలోదిగిన సర్ఫరాజ్ బ్యాటింగ్ విన్యాసాలు చూసి సమ్మోహితులయ్యారు. ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత కెప్టెన్ కోహ్లీ అంతటివాడు సర్ఫరాజ్ కు నీరాజనం పలకడం మామూలు విషయంకాదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడుతున్న అత్యంత పిన్నవయస్కుడు సర్ఫరాజే. ఈ ముంబైవాలా వయసు 17 ఏళ్లే. అయినా, ప్రతిభ పరంగా సీనియర్లకు పోటీ ఇస్తున్నాడు. టీమిండియాకు ఆశాకిరణంగా కనిపిస్తున్న ఈ రైట్ హ్యాండ్ బ్యాట్స్ మన్ అన్ని రకాల షాట్లు ఆడడంలో దిట్ట. నిన్నటి మ్యాచ్ లో అతనాడిన ఇన్నింగ్స్ నిడివి స్వల్పమే అయినా, అన్ని రకాల అస్త్రాలతో అలరించాడు. భవిష్యత్తులోనూ ఇలాగే ఆడితే టీమిండియా బెర్తు కోసం ఎక్కువకాలం వేచి చూడక్కర్లేదు.

More Telugu News