క్రికెట్ బుకీతో బీసీసీఐ కార్యదర్శి పార్టీ... చర్యలపై బీసీసీఐ అనాసక్తి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

క్రికెట్ బుకీతో బీసీసీఐ కార్యదర్శి పార్టీ... చర్యలపై బీసీసీఐ అనాసక్తి!

ఐపీఎల్ ఎంట్రీతో క్రికెట్ లో బుకీల పాత్ర ఏ స్థాయిలో ఉంటుందో తెలిసొచ్చింది. ఆటలో చక్రం తిప్పే క్రమంలో బుకీలు ఆటగాళ్లకు వల వేయడం తెలిసిందే. ఇందుకోసం మందు, మగువ, చివరాఖరుకు డబ్బును ఎరగా వేస్తున్నారు. వీటిని నియంత్రించాల్సిన గురుతర బాధ్యతను స్వీకరించిన బీసీసీఐ, తామేంటో నిరూపించుకుంటామని మొన్నటికి మొన్న భారీ ప్రకటనే చేసింది. అయితే ఓ బడా క్రికెట్ బుకీతో ఆ సంస్థ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ పార్టీ చేసుకుంటూ రెడ్ హ్యండెడ్ గా పట్టుబడ్డాడు. బీసీసీఐలో అద్యక్షుడి తర్వాత కార్యదర్శి పదవే అత్యున్నతమైనది. కీలక నిర్ణయాల్లో ఈ పదవిలోని వ్యక్తికి సముచిత స్థానం ఉంటోంది. అలాంటి పదవిలో ఉన్న అనురాగ్ ఠాకూర్, ఐసీసీ నిషేదిత జాబితాలో ఉన్న క్రికెట్ బుకీ కరణ్ గిల్హోత్రాతో కలిసి పార్టీ చేసుకున్నారట. ఓ ఆంగ్ల టీవీ ఛానెల్ ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలను ప్రసారం చేయగా, సమాచారం అందుకున్న ఐసీసీ సీఈఓ డేవిడ్ రిచర్డ్ సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఠాకూర్ పై చర్యలు తీసుకోవాలని రిచర్డ్ సన్ బీసీసీఐకి ఈ-మెయిల్ పంపారు. అయితే దీనిని బీసీసీఐ అధ్యక్షుడు జగ్ మోహన్ దాల్మియా ఏమాత్రం పట్టించుకున్న పాపానపోలేదట. నిన్న జరిగిన బీసీసీఐ సమావేశం అజెండాలో అసలు ఈ అంశమే లేదు. ఇదిలా ఉంటే, బీసీసీఐ సభ్యులపై మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ నెరపిన గూఢచర్యం విషయంపై దర్యాప్తు చేయనున్న కమిటీకి ఠాకూర్ నేతృత్వం వహించనున్నారు. బీజేపీ ఎంపీగానూ కొనసాగుతున్న ఠాకూర్ పై చర్యలకు జగ్ మోహన్ దాల్మియా అంతగా ఆసక్తి చూపడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

More Telugu News