60 అంతస్తుల ఆకాశహర్మ్యంలో ఏపీ సెక్రటేరియట్... 57వ ఫ్లోర్ లో సీఎం ఆఫీస్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

60 అంతస్తుల ఆకాశహర్మ్యంలో ఏపీ సెక్రటేరియట్... 57వ ఫ్లోర్ లో సీఎం ఆఫీస్!

పదుల ఎకరాల్లో సర్కారీ భవన సముదాయాలు... చుట్టూ కాంపౌండ్... మంత్రి కార్యాలయం ఒకచోట, ఆ శాఖాధికారుల కార్యాలయాలు మరోచోట. ఈ తరహా పాత చింతకాయ పచ్చడి సంస్కృతికి ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తిలోదకాలివ్వనున్నారు. రాష్ట్ర విభజన అనంతరం అమరావతి పేరిట కొత్తగా రూపుదిద్దుకోనున్న ఏపీ రాజధానిలో అన్నీ కొంగొత్త పోకడలేనట. ఇక రాష్ట్ర పరిపాలనకు కేంద్ర బిందువుగా ఉండనున్న సచివాలయం కోసం ఆకాశహర్మ్యాన్ని నిర్మించాలని కూడా చంద్రబాబు నిర్ణయించారట. మొత్తం 60 అంతస్తులతో ఏర్పాటు కానున్న ఈ అధునాతన భవంతిలోని 57వ ఫ్లోర్ లో ముఖ్యమంత్రి కార్యాలయం ఉంటుంది. ఆయా ప్రభుత్వ శాఖలకు చెందిన ఓక్కో శాఖకు ఒక్కో ఫ్లోర్ ను కేటాయిస్తారు. సదరు ఫ్లోర్ లో సంబంధిత శాఖ మంత్రితో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులు, ఆ శాఖల రాష్ట్ర స్థాయి కార్యాలయాలూ ఏర్పాటు కానున్నాయి. అంటే, ఏదేనీ శాఖ పని నిమిత్తం రాజధాని వచ్చే వారు ఆ శాఖ ఫ్లోర్ కు వెళితే, అన్ని పనులు అక్కడే జరిగిపోతాయన్న మాట. ఇక తొలి రెండు ఫ్లోర్లను కేవలం పార్కింగ్ కోసమే ఉపయోగించాలని కూడా ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ భవంతికి సంబంధించిన ప్లాన్ పై ప్రస్తుతం ముమ్మర కసరత్తు సాగుతున్నట్లు వినికిడి.

More Telugu News