Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు...రూ.1000 ఫైన్ కట్టండి: టీడీపీ ఎమ్మెల్యేకు హైకోర్టు ఝలక్

ఏపీలో అధికార టీడీపీ ఎమ్మెల్యేకు హైకోర్టు ఝలకిచ్చింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమే కాక కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని ఆక్షేపిస్తూ రూ.1000 జరిమానాను విధించింది. వివరాల్లోకెళితే... పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, జిల్లా జడ్జితో పాటు న్యాయాధికారుల పట్ల దురుసుగా వ్యవహరించారని కేసు నమోదైంది. దీనిపై నిన్న హైకోర్టు చీఫ్ జస్టిస్ కల్యాణ్ జ్యతిసేన్ గుప్తా, జస్టిస్ సంజయ్ కుమార్ లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. న్యాయమూర్తులపై దురుసుగా ప్రవర్తించడం ప్రజాప్రతినిధిగా మీకెంతవరకు సమంజసమని ధర్మాసనం ఎమ్మెల్యేను ప్రశ్నించింది. ఇది చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమే అవుతుందని, ఈ తరహా వైఖరి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని కూడా పేర్కొంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నందుకు రూ.1000 జరిమానా కట్టాలని తీర్పు చెప్పింది. అయితే సదరు ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తరఫు న్యాయవాది ధర్మాసనానికి వివరించారు. అందుకు అంగీకరించిన కోర్టు, క్షమాపణను రాతపూర్వకంగా సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

More Telugu News