ఇక చాలు... వడ్డీలు తగ్గించండి: బ్యాంకర్లకు కేంద్రం సూచన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇక చాలు... వడ్డీలు తగ్గించండి: బ్యాంకర్లకు కేంద్రం సూచన

రెండు నెలల వ్యవధిలో రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా అర శాతం మేరకు రెపో రేటును తగ్గించినప్పటికీ ఆ లాభం ప్రజలకు చేరకపోవడం పట్ల కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణం వడ్డీ రేట్లు తగ్గించాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బ్యాంకర్లకు సూచించారు. ఈ ఉదయం ప్రభుత్వ రంగ బ్యాంకు ప్రతినిధులతో సమావేశమైన ఆయన ఈ మేరకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. ఈ సమావేశానికి ఆర్ బీఐ, సిడ్బీ, ఎస్ హెచ్ బీ తదితర ఆర్థిక సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్ బీఐ తగ్గించిన వడ్డీ రేట్లను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. బ్యాంకులకు అవసరమైన రూ. 20 నుంచి రూ. 25 వేల కోట్లను అందించేందుకు ఇప్పటికిప్పుడు అవకాశం లేనందున మార్కెట్ల నుంచి సమీకరించుకోవచ్చని ఆర్థిక సేవల కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, తదుపరి పరపతి సమీక్ష నిర్ణయాలు చూసిన తరువాత వడ్డీ రేట్ల తగ్గింపుపై ఒక నిర్ణయానికి రావాలని బ్యాంకులు భావిస్తున్నాయి.

More Telugu News