Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చాక్లెట్ దొంగిలించాడని పదేళ్ల బాలుడిపై పోలీసుల థర్డ్ డిగ్రీ... రాత్రంతా స్టేషన్ లో నిర్బంధం!

చాక్లెట్ దొంగతనం చేశాడన్న అనుమానంతో వరంగల్ జిల్లా వర్ధన్నపేట పోలీసులు పదేళ్ల వయసున్న ఐదో తరగతి విద్యార్ధిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. అంతేకాదు, రాత్రంతా పోలీస్ స్టేషన్ లోనే ఉంచుకుని సదరు బాలుడి కాళ్లను మొద్దుకు కట్టేసి పైశాచికంగా ప్రవర్తించారు. వివరాల్లోకెళితే... వరంగల్ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామానికి చెందిన పదేళ్ల బాలుడు వీరన్న, మండల కేంద్రంలోని ఎస్టీ బాలుర వసతి గృహంలో ఉంటూ ఐదో తరగతి చదువుతున్నాడు. శనివారం మధ్యాహ్నం తోటి విద్యార్థులతో కలిసి, ఓ దుకాణం వద్దకెళ్లాడు. షాపులో వ్యక్తులు కనిపించకపోయేసరికి వారిని పిలుచుకుంటూ లోపలికెళ్లాడు. ఇంతలోనే ఓ తుంటరి విద్యార్థి దుకాణం షట్టర్ లాగేసి పరుగందుకున్నాడు. లోపల చిక్కుకున్న వీరన్న షట్టర్ ను కొడుతూ కేకలేయడంతో పక్కనున్న వారితో పాటు దురాణం యజమాని అక్కడికి వచ్చారు. దుకాణంలో చాక్లెట్ దొంగతనానికి వచ్చావని బాలుడిని దూషించిన యజమాని అతడి జేబులోని రూ.300 లాగేసుకోగా, ఓ చోటా రాజకీయ నేత బాలుడిని పోలీసులకు అప్పగించాడు. బాలుడిని మందలించి వదిలేయాల్సింది పోయి, పోలీసులు అతడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. విషయం తెలుసుకున్న వార్డెన్ వెళ్లినా బాలుడిని వదలలేదు. రాత్రంతా స్టేషన్ లోనే ఉంచుకున్న పోలీసులు బాలుడి కాళ్లను పెద్ద మొద్దుకు కట్టేశారు. తీరా మీడియా రంగప్రవేశంతో ఆదివారం ఉదయం బాలుడిని వార్డెన్ కు అప్పగించారు. విషయం తెలిసిన పోలీసు ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.

More Telugu News