మరోసారి ఆంధ్రప్రజలు మోసపోతున్నారు: ఉండవల్లి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మరోసారి ఆంధ్రప్రజలు మోసపోతున్నారు: ఉండవల్లి

రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రజలు ఒకసారి మోసపోతే, మరోసారి ఆంధ్రుల్ని మోసం చేసేందుకు బీజేపీ నేతలు రంగం సిద్ధం చేస్తున్నారని ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ నేతలు కొత్త కొత్త భాష్యాలు చెబుతూ ఆంధ్రుల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని హెచ్చరించారు. విభజన చట్టాలను అమలు చేయండని అడిగితే, లీగల్ గా ఉన్నవన్నీ అమలు చేస్తామని అరుణ్ జైట్లీ అంటున్నారని ఆయన చెప్పారు. అసలు విభజనలో న్యాయం ఉందా? అని ఆయన నిలదీశారు. చట్టప్రకారం తాము నో-కాన్ఫిడెన్స్ మోషన్ ఇస్తే, దానిని చర్చకు రాకుండా అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీలు అడ్డుకోలేదా? అని ఆయన ప్రశ్నించారు. అధికార పక్షం, ప్రతి పక్షం కలిసి ప్రజలను ముంచే రోజున ఆ ప్రయత్నాలను అడ్డుకోవాలని రాజ్యాంగంలో కొన్ని హక్కులు, నిబంధనలు కల్పించారని ఆయన తెలిపారు. బీజేపీ నేతలు గతంలో అన్న మాటలు ఏమయ్యాయని ఆయన నిలదీశారు. పిల్లకు జన్మనిస్తూ తల్లిని హత్య చేశారన్న మాటలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. నేతలు బాగానే ఉంటారని అన్న ఆయన, ప్రజలను రక్షించాల్సిన బాధ్యత వారిదేనని సూచించారు.

More Telugu News