: శామ్ సంగ్ ఉద్యోగులకు ఈ ఏడాది జీతాలు పెరగవట!
ప్రముఖ మొబైల్ సంస్థ శామ్ సంగ్ తన దక్షిణ కొరియా ఉద్యోగుల జీతాల పెంపుదలను నిలిపివేయనుంది. 2015 సంవత్సరానికి ఉద్యోగుల జీతాలను పెంచడం వీలుపడదని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. గత ఆరేళ్లలో జీతాల పెంపు నిలిపివేయడం ఇదే తొలిసారి. స్మార్ట్ ఫోన్ రంగంలో పెరుగుతున్న పోటీ నేపథ్యంలో లాభాల తగ్గుదలతో జీతాల పెంపు విషయంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రంగంలో ప్రత్యర్థులైన ఆపిల్ కొత్త ఐఫోన్లు, జియోమి వంటి చైనా ఫోన్ల పోటీతో మార్కెట్ లో శామ్ సంగ్ షేరు పడిపోయింది. ఈ క్రమంలో ఈ దక్షిణ కొరియా దిగ్గజం 2011 తరువాత మొట్టమొదటిసారిగా వార్షిక లాభాల్లో తరుగుదలను నమోదు చేసుకుంది. చివరిసారిగా 2009లో ఈ సంస్థ ఉద్యోగుల జీతాల పెంపును నిలిపివేశాక, కంపెనీ ప్రపంచ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడగానే అప్పటి నుంచి జీతాలు పెంచుకుంటూ వచ్చింది.