డబ్బు కోసం కిడ్నాప్ డ్రామా... తండ్రికే ఫోన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డబ్బు కోసం కిడ్నాప్ డ్రామా... తండ్రికే ఫోన్

జల్సాలకు అలవాటుపడ్డ ఓ యువకుడు డబ్బు కోసం కన్న తండ్రినే మోసం చేశాడు. తనను కిడ్నాప్ చేశారని తండ్రిని బెదిరించి రూ.1.93 లక్షలు జల్సా చేశాడు. పోలీసుల కథనం ప్రకారం, ముంబైకి చెందిన విజయ్ రోహన్ (23) హైదరాబాదులో హాస్టల్ లో ఉంటూ ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నాడు. కార్లలో తిరుగుతూ, ఖరీదైన హోటళ్లలో బస చేసి జల్సాలు చేయడం ఇతని హాబీ. ఖర్చులకు జీతం డబ్బు సరిపోకపోవడంతో, కిడ్నాప్ డ్రామాకు తెర తీశాడు. ముంబైలో ఉండే తండ్రికి ఫోన్ చేసి, కొందరు తనను కిడ్నాప్ చేశారని, వెంటనే తన బ్యాంక్ అకౌంట్ లో డబ్బు వేయాలని ఒత్తిడి చేశాడు. ఎవరికైనా చెప్తే కిడ్నాపర్లు తనను చంపేస్తారని భయాన్ని నటించాడు. తన అకౌంట్ లో రూ.1.93 లక్షలు వేయించుకుని జల్సా చేశాడు. కిడ్నాపర్లు మళ్లీ డబ్బు అడుగుతున్నారని తండ్రికి ఫోన్ చేశాడు. దీంతో ఆయనకు అనుమానం వచ్చి నిలదీయగా, విజయ్ పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఆయన పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. కేసు దర్యాప్తు చేసి కొడుకే డబ్బు కోసం కిడ్నాప్ డ్రామా ఆడాడని పోలీసులు నిర్థారించారు. నిందితుడు విజయ్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

More Telugu News