ఆ ఊరి వాసులను వెతుక్కుంటూ వచ్చిన అదృష్టం... ఇక మహర్దశే!
నిన్నమొన్నటి వరకూ వేలల్లో ఉన్న భూముల ధరలు ఒక్కసారిగా లక్షల్లోకి వెళ్లాయి. మారుమూల గ్రామం పట్టణ శోభను సంతరించుకుంటోంది. అధికారులు ఉరుకులు, పరుగుల మీద వస్తున్నారు. రోడ్లు బాగుపడనున్నాయి. భారీ సంఖ్యలో ప్రజలు రానున్నారు. వ్యాపారాలు పెరుగుతాయి... ఇదంతా ఆ గ్రామానికి పట్టిన అదృష్టం. అదే కడప జిల్లా ఒంటిమిట్ట. ఆంధ్రప్రదేశ్ లో అత్యంత పురాతన రామాలయాన్ని కలిగి ఉండడమే ఆ గ్రామం చేసుకున్న అదృష్టం. రోజూ కనీసం వందల సంఖ్యలో కూడా భక్తులురాని ఆ గుడికి ఇక వేలు, లక్షల సంఖ్యలో భక్తులు రానున్నారు.
ఒంటిమిట్ట కోదండ రాముని బ్రహ్మోత్సవాలు భద్రాచలంలో కంటే ఘనంగా జరపాలని బాబు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉండటమే ఇందుకు కారణం. విభజన అనంతరం ఏపీలో శ్రీరామనవమి ఉత్సవాలను ఒంటిమిట్టలో జరపాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. చారిత్రక అంశాలు, స్థల పురాణం, ఇతరత్రా అంశాల వారీగా ప్రాశస్త్యం కలిగిన ఒంటిమిట్టకే బాబు సర్కారు పట్టం కట్టింది. శ్రీరామనవమి దగ్గర పడుతున్న సమయంలో భక్తులకు వసతులు, వాహనాల పార్కింగ్, తాగునీరు ఏర్పాట్లు తదితర పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇక నిత్యం వేద పారాయణం జరపాలని, కొత్త కల్యాణ కట్టలు, కమర్షియల్ కాంప్లెక్స్ వంటివి నిర్మించి, కాణిపాకం, శ్రీకాళహస్తి తరహాలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.